Your Name : Your Email :

Health problem :

Thursday, September 11, 2014

Sex interests and myths in the public-శృంగారం పట్ల మన సమాజంలో ఆసక్తి..అపోహలు.






  • స్త్రీలతో పోలిస్తే పురుషులకు సెక్స్‌ ఆలోచనలు ఎక్కువా?

ఇది చాలా వరకూ నిజమే. ఇదేదో పురుషుల మీద లేనిపోని ముద్ర వెయ్యటం వంటిదేం కాదు. దీని వెనక జీవభౌతిక, శారీరక కారణాలున్నాయి. స్త్రీలలోనైనా, పురుషుల్లోనైనా లైంగిక వాంఛలకు మూలం 'టెస్టోస్టిరాన్‌' హార్మోను! పురుషుల్లో ఇదే ప్రధాన హార్మోను. కానీ స్త్రీల విషయానికి వచ్చే సరికి వారిలో స్త్రీ హార్మోన్త్లెన ప్రొజెస్టిరాన్‌, ఈస్ట్రోజెన్‌లు ఎక్కువగానూ, ఈ  టెస్టోస్టిరాన్‌ తక్కువగానూ ఉంటాయి. అందుకే సహజంగానే పురుషుల్లో లైంగిక వాంఛలు కొంత ఎక్కువ. రెండోది- టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి కూడా పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది
వృషణాల్లోనూ, శరీర కండరాల్లో కూడా తయారవుతుంటుంది. పురుషుల్లో కండర పుష్టి ఎక్కువ కాబట్టి వీరిలో ఈ హార్మోను ఉత్పత్తీ ఎక్కువే. ఇక స్త్రీలలో ఉండే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌
హార్మోన్లు వారిలో మృదుత్వానికి, సాధు స్వభావానికి, సంతాన పరిరక్షణ, పరిపోషణలకు ఉపకరిస్తాయి. అలాగే పరిణామ క్రమంలో చూసుకుంటే- మానవ జాతిలో కలయిక కోసం,
పునరుత్పత్తి కోసం చొరవ తీసుకోవటమనేది పురుష లక్షణంగా అవతరించింది. అందుకే తరచుగా పురుషుడే ఎక్కువగా స్త్రీని అనుసరిస్తుంటాడు. వీటన్నింటి వల్లా పురుషుల్లో కామ
వాంఛలు కొంత ఎక్కువనే చెప్పొచ్చు. అయితే దీనర్థం పురుషులు చెడ్డవారనీ, స్త్రీలు మంచివారనీ కాదు.. దీన్ని లింగపరమైన ప్రకృతి సహజ స్వభావంగా అర్థం చేసుకోవటం అవసరం.

  •  పురుషులు ప్రతి 7 సెకన్లకు ఒకసారి సెక్స్‌ గురించి ఆలోచిస్తారా?

పురుషుల్లో లైంగిక వాంఛలు కొంత ఎక్కువన్న మాట నిజమేగానీ.. వాళ్లు రోజంతా దాని గురించే ఆలోచిస్తుంటారన్నది పూర్తిగా అపోహే! ఇదసలు అసాధ్యం కూడా. అయితే అవకాశం
ఉన్నప్పుడు, వీలున్నప్పుడల్లా పురుషుడు సెక్స్‌ గురించి ఆలోచించే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు పురుషుడు కూర్చుని చదువుకుంటుంటే.. ఆ పక్క నుంచి ఓ స్త్రీ వెళుతోందనుకోండి.. చదివేది ఆపి.. ఆమె వంక ఓసారి తేరిపారజూసి, మళ్లీ పుస్తకంలో తలదూర్చొచ్చు! ఇది సహజం. ఇందుకు ఆమె అందంగానే ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో సెక్స్‌ కోరిక లేకపోవచ్చుగానీ ఇది ప్రకృతిపరంగా పురుషుల సహజాతం. పురుషుల్లో స్త్రీల పట్ల ఆసక్తి, స్త్రీ గురించీ, సెక్స్‌ గురించీ ఆలోచించటమన్నది ఈ జాతి వృద్ధికి
అవసరమైన, జీవ పరిణామంలో అబ్బిన లక్షణంగా చెప్పుకోవచ్చు. సెక్స్‌ భావనలన్నవి ఇతర ఇంద్రియ ప్రేరణల తర్వాతే.. అంటే దృశ్యం, శబ్దం, స్పర్శ, వాసనల వంటి ఇతర ఇంద్రియాలకు సంబంధించిన సమాచారం అందిన తర్వాతే.. శృంగార భావనలు తలెత్తుతాయి. పురుషులకు ఇలాంటివి గ్రహించే గుణం సహజంగానే ఎక్కువ. కాబట్టి వీరు స్త్రీ సంబంధ సంకేతాలకు త్వరగా ఆకర్షితులవుతారు. ప్రకృతి సహజమైన ఈ ఏర్పాటు వెనకున్న లక్ష్యం  సంతానాభివృద్ధీ, జాతి మనుగడలే.

  • సెక్స్‌ ను స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా 'ఎంజాయ్‌' చేస్తారా?

ఇదేం నిజం కాదు. ఇదో పురుషాహంకార భావన. సంభోగాన్ని స్త్రీపురుషులు ఇరువురూ సమాన స్థాయిలోనే ఆస్వాదిస్తారు. అయితే పురుషుల ప్రవర్తన, వ్యవహార శైలి కాస్త బాహాటంగా, నాటకీయంగా ఉండి, వాళ్లు సెక్స్‌ని ఎక్కువగా 'ఎంజాయ్‌' చేస్తున్నట్టు అనిపించొచ్చు. అదే స్త్రీల విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తీకరణలు కాస్త మృదువుగా, నిదానంగా, సున్నితంగా అనిపించొచ్చుగానీ.. వాస్తవానికి స్త్రీలు పురుషుల కంటే భావప్రాప్తిలో గాఢమైన అనుభూతి పొందుతారు. పైగా స్త్రీలు సంభోగ సమయంలో ఒకసారి కాదు.. పలుమార్లు భావప్రాప్తి పొందొచ్చు కూడా. అదే పురుషుల్లో ఒక్కసారి స్ఖలనం అయిపోయిందంటే అంగం బిగువు కోల్పోతుంది, సెక్స్‌ వాంఛా తీరిపోతుంది. నిజానికి ఇది సంతాన వృద్ధి కోసం ఉన్న ఏర్పాటు. ఎందుకంటే పురుషుడు స్ఖలించిన వీర్యం.. అందులోని శుక్రకణాలు.. ఎక్కడో పైన ఫలోపియన్‌ ట్యూబుల వద్ద ఉండే అండం వరకూ చేరుకుంటేనే సంయోగం, గర్భధారణ సాధ్యమవుతాయి. ఒకవేళ స్ఖలనం తర్వాత కూడా పురుషుడు సంభోగాన్ని కొనసాగిస్తూనే ఉంటే అది ఈ అండ-శుక్ర సంయోగ ప్రక్రియకు అవరోధంగా మారొచ్చు. అందుకే స్ఖలనంతో సాధారణంగా సంభోగం ముగుస్తుంది. సంభోగంలో స్త్రీలు పలుమార్లు భావప్రాప్తి పొందినా, పురుషులు ఒక్కసారే పొందినా... సెక్సును ఇద్దరూ సమానంగానే ఆస్వాదిస్తారు. ఇరువురూ తృప్తిని పొందుతారు. ఇందులో ఒకరు ఎక్కువనీ, మరొకరు తక్కువనేం ఉండదు.

  • కేవలం ముద్దులు పెట్టుకున్నంత మాత్రాన నష్టం ఏమీ జరగదా?

ఇది పూర్తిగా అపోహే. సుఖవ్యాధులనేవి కేవలం జననాంగాల ద్వారా మాత్రమే వ్యాపిస్తాయనుకోవటం పొరపాటు. చాలా సుఖవ్యాధులూ, ఇన్ఫెక్షన్లూ.. ముద్దుల ద్వారా కూడా రావచ్చు. ముద్దులు పెట్టుకున్నా, స్త్రీపురుషుల్లో ఎవరు అంగచూషణం చేసినా.. నోటి ద్వారా వ్యాధికారకాలు ఒకరి నుంచి మరొకరికి సంక్రమించొచ్చు. సుఖవ్యాధుల వ్యాప్తికి ముద్దులు కూడా ఒక మార్గమే.

  • శృంగారానుభవానికి అంగం సైజు ముఖ్యమా?

లైంగిక తృప్తికి పురుషాంగం పరిమాణమే ముఖ్యమన్నది పెద్ద అపోహ. అయితే అసలు సైజుకు ఏ మాత్రం ప్రాముఖ్యం లేదనుకోవటానికి కూడా లేదు. సగటు పరిమాణం ఉండటం
అవసరం. ముఖ్యంగా పొడవు ఒక్కటే కాదు.. తగినంత లావు ఉండటం కూడా ముఖ్యమే. అంగ ప్రవేశం తర్వాత కూడా స్త్రీకి అది జరిగినట్లు తెలియకపోతుంటే కచ్చితంగా సమస్య ఉందనే అర్థం. మరోవైపు స్త్రీల యోని కూడా కొందరిలో చాలా సాగినట్లు ఉండొచ్చు, కొందరిలో కాన్పు సమయంలో చినిగినట్లవ్వచ్చు, లేదూ వైద్యులు కాన్పు కోసం కోత బెట్టటం (ఎపిసియాటమీ) సరిగా చెయ్యకపోవచ్చు, కారణమేదైనా అంగం తగినంత పరిమాణం ఉండటం ముఖ్యమే. దేశదేశాల్లో సగటున పురుషాంగం సైజు ఎంత ఉంటోందన్న దానిపై చాలా అధ్యయనాలు చేశారు. ఇవి మన దేశంలోనూ జరిగాయి. సగటున పురుషాంగం పొడవు 4 అంగుళాలున్నా చాలు. సైజు కన్నా కూడా భాగస్వామిని తృప్తిపరచటం ఎలాగన్నది, ఎక్కడెక్కడ ప్రేరణలు ఇస్తే ఆమె ఉత్తేజితమవుతుందన్నది తెలియాలి. అలాగే చాలామంది పురుషాంగం పొడవుగా ఉండాలనుకుంటుంటారుగానీ వాస్తవానికి పొడవు కంటే తగినంత లావు ఉండటం స్త్రీ తృప్తికి చాలా ముఖ్యం. స్త్రీకి తృప్తినిచ్చే కేంద్రాలన్నీ కూడా చాలావరకూ యోని పైభాగానే, ముఖద్వారం చుట్టూరానే ఉంటాయి. లోపలి భాగమంతా కేవలం ఓ గొట్టం వంటిదే. అక్కడ పెద్దగా స్పందనలేవీ తెలియవు కూడా. పైగా కాన్పు సమయంలో బిడ్డ పట్టేటంతగా సాగాలి కాబట్టి ప్రకృతి సహజంగానే ఈ లోపలి గొట్టపు భాగం నొప్పి వంటి భావనలు పెద్దగా తెలియకుండా నిర్మితమై ఉంటుంది. సంభోగ సమయంలో పురుషుడు స్ఖలించే వీర్యాన్ని పైకి పంపించటం తప్పించి.. ఈ గొట్టంలాంటి యోని ఆకృతికి పెద్దగా ప్రయోజనమేదీ లేదు. తృప్తి కేంద్రాలన్నీ కూడా యోని ఉపరితల భాగాల్లోనే ఉంటాయి కాబట్టి పురుషాంగం సైజు ఎంత ఉన్నా తృప్తికి అది ముఖ్యం కాదు. నీలిచిత్రాలు చూసి సైజుల విషయంలో ఏవేవో వూహించుకునేవారు మాత్రం నిరుత్సాహానికి గురవటం తథ్యం.

  • మందులతో పురుషాంగం సైజు పెరిగేలా చెయ్యొచ్చా?

లేదు. పిల్లవాడు ఒకసారి యవ్వనంలోకి అడుగుపెట్టి, పురుషాంగం తన సహజమైన సైజుకు పెరిగిన తర్వాత ఇక అది తగ్గటం, పెరగటమన్నది ఉండదు. పెంచేందుకు ఎలాంటి మందులూ లేవు కూడా. నిజంగానే మరీ చిన్నగా ఉన్నవారికి- ఇటీవలి వరకూ సైజు పెంచే సర్జరీ చేసేవారుగానీ దాని ప్రభావాలను అధ్యయనం చేసిన తర్వాత ఇటీవలి కాలంలో ఈ సర్జరీలను బాగా తగ్గించేస్తున్నారు.

  • నీలిచిత్రాలను స్త్రీలు ఏవగించుకుంటారా? బ్లూఫిల్మ్‌లు వారికి నచ్చవా?

 పురుషులతో పోలిస్తే స్త్రీలకు నీలిచిత్రాల పట్ల ఆసక్తి కొంత తక్కువనే చెప్పాలి. నీలిచిత్రాల్లో చూపించేవి అభూతకల్పలన్న వాస్తవం పురుషులకంటే స్త్రీలకు బాగా తెలియటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. ఈ చిత్రాల్లో చూపించే 'పోర్న్‌ స్టార్‌'లను చూసి, వాళ్లు   చూపించేవి, వాళ్లు చేసేవన్నీ నిజాలేనని నమ్మటానికి పురుషులు ఇష్టపడుతుంటారు. పెద్ద పెద్ద రొమ్ములు, గంటల తరబడి సంభోగంలో పాల్గొంటూ పెద్దపెద్దగా మూలుగుతుండటం, గంటల తరబడి అంగచూషణం, పురుషాంగాన్ని ఎక్కడెక్కడో పెడుతూ రకరకాల ప్రయోగాలు
చేస్తుండటం.. ఇలాంటి దృశ్యాలన్నీ పురుషులకు ప్రేరకాలుగా అనిపించొచ్చేమోగానీ ఈ  తరహా వ్యవహారాలు స్త్రీలను ఏమంత ఉత్సాహపరచవు. ఇదంతా చాలా వరకూ పురుషుల
ఫాంటసీ ప్రపంచం. బయట విరివిగా లభ్యమయ్యే చాలా నీలిచిత్రాల్లో ఇవే ఉంటాయి.  ఇటువంటి అతిచేష్టలు కాకుండా.. సున్నితంగా, హృద్యంగా, అందంగా సాగే నీలి/శృంగార చిత్రాలు స్త్రీలకూ బాగానే గిలిగింతలు పెట్టొచ్చు.

  • నీలిచిత్రాలు ఎక్కువగా చూసే పురుషుల్లో అతిప్రవర్తనలు రావచ్చా?

కొంతవరకూ నిజమే. లైంగిక సమస్యలకు, ముఖ్యంగా వైఫల్యాలకు నీలిచిత్రాలు ఎక్కువగా చూడటం (పోర్నోగ్రఫీ) కూడా ఒక ముఖ్య కారణం. పురుషుల్లో ఈ సమస్య చాలా ఎక్కువ,
స్త్రీలలో కొంత తక్కువ. ముఖ్యంగా స్త్రీలు ఈ చిత్రాల్లో చూపించేవన్నీ నిజాలేననీ, మిగతా  పురుషులంతా ఈ చిత్రాల్లో చూపిస్తున్నంత దృఢంగా ఉంటారనీ, తమ భర్తలే ఎందుకూ 
కొరగాకుండా ఉన్నారని నమ్మటం మొదలుపెడితే పరిస్థితి సమస్యాత్మకంగా   తయారవుతుంది. అలాగే పురుషులు కూడా వీటిని చూసి భార్యలతో లేదా భాగస్వాములతో రకరకాల ప్రయోగాలకు దిగితే ఇబ్బందే. చాలాసార్లు స్త్రీలు వీటికి అంగీకరించకపోవచ్చు. భాగస్వామి ఒత్తిడి భరించలేక ఒప్పుకున్నా అందులో తృప్తి పొందలేక రకరకాల మానసిక రుగ్మతల్లో చిక్కుకోవచ్చు. నీలిచిత్రాల వల్ల భావోద్వేగాల పరంగా చాలా ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ అందరి విషయంలో ఇలాగే జరిగి తీరతాయని చెప్పలేంగానీ వీటితో ఈ రకం ముప్పు మాత్రం కచ్చితంగా ఉంటుంది.

నీలిచిత్రాల్లో చూపించేలా సంభోగ సమయంలో మూలుగులు, కేకల వంటివి తృప్తికి సంకేతాలా?

కచ్చితంగా కాదు. పైగా ఆమె తృప్తి కలగకపోయినా కలిగినట్టు నటిస్తోందని చెప్పటానికి (ఫేకింగ్‌) ఇదో సంకేతం. నిజానికి సంభోగ సమయంలో, ముఖ్యంగా భావప్రాప్తిని పొందే క్రమంలో స్త్రీలు చిన్నచిన్న సవ్వడులు, నిట్టూర్పులు, మూలుగుల వంటి ధ్వనులు చెయ్యటం సహజమే. కానీ నీలిచిత్రాల్లో వీటిని చాలా ఎక్కువ చేసి చూపిస్తుంటారు. నిజ జీవితంలో ఈ 
సమయంలో స్త్రీలు చేసే సున్నిత ధ్వనులకూ, ఈ చిత్రాల్లో చూపించే వాటికీ ఏమాత్రం పోలిక ఉండదనే చెప్పొచ్చు. మొత్తానికి భావప్రాప్తి సమయంలో చిన్నచిన్న ధ్వనులు చెయ్యటమన్నది ఆమె అనుభవిస్తున్న భావోద్వేగానికి ప్రతిస్పందన వంటిదే, ఇది సహజం.

  • బహిష్టు సమయంలో సంభోగం వల్ల గర్భధారణ జరగదా?

అవకాశాలు తక్కువ. అలాగని పూర్తిగా నమ్మటానికీ లేదు. ఎందుకంటేకొందరికి ఎక్కువ, తక్కువలు వస్తుంటాయి. కొందరికి రుతుక్రమం నెల మధ్యలో వస్తుంటుంది. అవి నిజమైన 
బహిష్టులో, కాదో.. లోపల అండం విడుదల జరుగుతోందో లేదో కూడా గుర్తించటం కష్టం. కాబట్టి గర్భనిరోధంగా ఈ విధానాన్ని నమ్ముకోవటానికి లేదు. గంటకొట్టినట్లుగా.. కచ్చితంగా
తేదీల ప్రకారం బహిష్టులు వస్తుండే వారికి మాత్రం ఈ సమయంలో గర్భధారణ   జరగకపోవచ్చు. అయితే గర్భధారణ అవకాశాలు తక్కువే కావచ్చుగానీ బహిష్టు  సమయంలో సంభోగం కొంత చికాకుగా అనిపించొచ్చు. ఈ సమయంలో బయటకొస్తుండే రుతుస్రావానికి తోడు.. యోనిలో మృదుత్వం కోసం సాధారణంగా సంభోగ సమయంలో వూరే స్రావాలు ఈ సమయంలో ఉండకపోవచ్చు కూడా.

  • మొదటిసారి సెక్సులో పాల్గొన్నప్పుడు గర్భం రాదా?

అలాగనేం లేదు. గర్భనిరోధక విధానాలేవీ పాటించకుండా సెక్సులో ఎప్పుడు పాల్గొన్నా.. అది మొదటిసారి కావచ్చు.. ఆ తర్వాతైనా కావచ్చు.. ఎప్పుడైనా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది! వీర్యంలో చురుకైన, తగినన్ని శుక్రకణాలున్న పురుషుడు సెక్సులో పాల్గొని స్ఖలించినప్పుడు.. అదే సమయంలో స్త్రీలో కూడా అండాల విడుదల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు.. ఆ కలయిక మొదటిసారి అయినా.. లేక ఎన్నోసారైనా.. గర్భధారణ అవకాశాలు మొండుగానే ఉంటాయి.
  • స్ఖలనానికి కొద్ది ముందు అంగాన్ని బయటకు తీసెయ్యటం ద్వారా గర్భం రాకుండా చూసుకోవచ్చా?

కచ్చితంగా చెప్పలేం. గర్భనిరోధం కోసం చాలామంది ఈ పద్ధతి పనికొస్తుందని భావిస్తుంటారు, దీనికి వైద్యపరంగా 'కాయిటస్‌ ఇంటరప్టస్‌' అనే పేరు కూడా ఉందిగానీ.. నిజానికి ఇది సమర్థమైన గర్భనిరోధక విధానం కాదు. ఎందుకంటే స్ఖలనం జరిగి వీర్యం బయటకు రావటమన్నది సంభోగం చివ్వరే జరగొచ్చుగానీ.. అంతకు ముందు సంభోగం కొనసాగుతున్నంత సేపూ కూడా పురుషాంగం నుంచి కొన్ని స్రావాలు వస్తూనే ఉంటాయి. ఈ స్రావాల ద్వారా కూడా కొన్ని శుక్రకణాలు యోనిలోకి చేరిపోవచ్చు. కాబట్టి గర్భనిరోధానికి ఇది నమ్మదగ్గ పద్ధతి కానేకాదు. పైగా భావప్రాప్తికి చేరువయ్యే ఆ సమయంలో పురుషుడు నియంత్రించుకోవటం, సంభోగాన్ని ఆపెయ్యటమంటే అంత సులభంగా అయ్యేదీ కాదు, దానివల్ల సరైన శృంగార సౌఖ్యమూ దక్కదు. కాబట్టి సమర్థమైన ఇతర పద్ధతులను అనుసరించటం ఉత్తమం.

  • సంభోగానంతరం వెంటనే కడిగేసుకుంటే గర్భం రాదా?

ఇది వట్టి అపోహ. ఎందుకంటే పురుషుడు స్ఖలిస్తున్న సమయంలోనే.. శుక్రకణాలు చిక్కటి, ఓ చిన్న ముద్దలా తయారై వేగంగా బయటకొస్తాయి. స్ఖలన సమయంలో ఇదేమీ పల్చటి ద్రవంలా ఉండదు. కాబట్టి కడిగేసుకుంటే అంత తేలికగా పోయేది కాదు. పైగా యోని అనేది ఒక సొరంగ మార్గంలాగో, తూములాగో ఉండేదేం కాదు. ఒక రకంగా గరాటులా ఉంటుందనుకోవచ్చు. పురుషాంగమో, మరేదైనా లోపలికి ఒత్తిడితో నెడితేనే ఇది   తెరుచుకుంటుంది. సంభోగానంతరం పురుషాంగం బయటకు తీసెయ్యగానే అది మూసుకుపోతుంటుంది. పురుషుడు స్ఖలించిన వీర్యం, అందులోని శుక్రకణాలన్నీ లోపలే ఉండిపోతాయి. వీర్యంలో శుక్రకణాలతో పాటు ఉండే ద్రవమంతా కూడా ఆ శుక్రకణాలకు కావాల్సిన పోషకాహారమే. స్ఖలనం తర్వాత పురుషుడి శరీరం నుంచి బయటపడిన శుక్రకణాలు.. ఇక అక్కడి నుంచీ స్త్రీ శరీరం నుంచి పోషకాలను గ్రహించటం  మొదలుపెడతాయి. పురుషాంగం తీసెయ్యగానే యోని దగ్గరకు ముడుచుకుంటుంది, శుక్రకణాలన్నీ లోపల చిక్కుకున్నట్టుగా ఉండిపోతాయి. స్త్రీ బయటి నుంచి.. పైపైన ఎంతగా శుభ్రం చేసుకున్నా.. శుక్రకణాలుండే ఆ లోలోపలి ప్రాంతాన్ని అంత తేలికగా చేరుకోలేదు. లోపల శుక్రకణాలు లోపలే ఉండి.. అక్కడి నుంచే లోపలికే ప్రయాణం ఆరంభిస్తాయి. కాబట్టి సంభోగానంతరం స్త్రీ యోని భాగాన్ని ఎంతగా కడుక్కున్నా.. గర్భధారణ జరగదని భావించటానికి లేదు. అలాగే చాలామంది సంభోగానంతరం మూత్రవిసర్జన చేసినా గర్భం రాదనుకుంటుంటారుగానీ ఇదీ  ఒట్టి అపోహే. ఎందుకంటే యోని మార్గం వేరు, మూత్రవిసర్జన ద్వారం వేరు. దీనికీ, దానికీ ఎలాంటి సంబంధం ఉండదు.

  • వయసు పెరిగే కొద్దీ లైంగిక వాంఛలు, సెక్స్‌ మీద ఆసక్తి తగ్గిపోతాయా?

 ఇది పూర్తిగా అపోహే! వందేళ్లు దాటిన వారిలో కూడా లైంగికపరమైన ఆసక్తులు  చచ్చిపోతాయనుకోవటానికి లేదు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు, పరిశోధనలు చాలానే జరిగాయి. మనుషులు మరణించే వరకూ కూడా లైంగికంగా ఆసక్తులయ్యే ఉంటారని వీటిలో స్పష్టంగా గుర్తించారు. కాకపోతే యుక్తవయసులో ఉండే ఆసక్తీ.. మలివయసులో ఉండే ఆసక్తీ ఒకే రకంగా ఉండదు. యుక్తవయసులో ఉన్న వారిలా మలి వయసులో రోజుకోసారి సంభోగం వంటివి సాధ్యం కాకపోవచ్చు. కానీ స్త్రీపురుషుల మధ్య సాన్నిహిత్యానికి ఉండే ప్రాముఖ్యం మాత్రం మనిషి మరణించే వరకూ కూడా తగ్గదు. కేవలం చేయి పట్టుకోవటమే కావచ్చు... అది కేవలం సాన్నిహిత్య భావనే కావచ్చు.. కానీ దానికీ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి వయసుతో పాటు సెక్స్‌ వాంఛల, కోరికల రూపం మారొచ్చేమోగానీ ఆసక్తి తగ్గిపోవటమన్నది మాత్రం ఉండదు.

  • కాన్పు తర్వాత స్త్రీలకు సెక్సు అంటే విముఖత పెరుగుతుందా?

కొంత వరకూ నిజమే. అయితే కాన్పు అయిన వెంటనే, కొద్దిరోజుల పాటు మాత్రమే ఇలా ఉండొచ్చు. దీనికి కొంత వరకూ శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పులు కారణమైతే.. తల్లి ధ్యాస
మొత్తం కొత్తగా పొత్తిళ్లలోకి వచ్చిన బిడ్డపైనే ఉండటం మరో ముఖ్యకారణం. ఈ సమయంలో ఆమె మనసు మరి దేనిపైకీ మళ్లదు. అందువల్ల కూడా మిగతా వాంఛలన్నీ అప్రధానమైపోతాయి. ప్రాధాన్యాలు మారతాయేగానీ.. కాన్పు తర్వాత స్త్రీలు సెక్స్‌ వాంఛలకు విముఖంగా తయారవటమన్నది మాత్రం ఉండదు.

  • హస్తప్రయోగం చేసుకోవటం వల్ల బలహీనపడతారా?

ఇది పూర్తిగా అపోహే! వీర్యమనేది శరీరం నుంచి బయటకు వెళ్లిపోవటానికే ఉత్పత్తి అవుతుంది. ఇదేమీ దాచుకోవాల్సిన ద్రవం కాదు. అలా దాచుకోవటం అసాధ్యం కూడా. ఎందుకంటే ఈ వీర్యం మూత్రాశయం వెనక చిన్న తిత్తిలా ఉండే 'సెమినల్‌ వెసికల్‌' గ్రంథుల్లో తయారవుతుంది. ఇది మహా అయితే 7-8 మిల్లీలీటర్లు ఉంటుంది. శుక్రకణాలు వృషణాల్లో తయారై, అక్కడి నుంచి ఈ తిత్తిలోకి వచ్చి చేరుకుంటాయి, వాటికి కావాల్సిన పోషకాలను అందించటం ఈ ద్రవానికి ఉన్న ప్రయోజనం. ఈ ద్రవంలో ఉండేది కూడా ఫ్రక్టోజ్‌ వంటి చక్కెరలు తప్పించి మరేమీ కాదు. సెమినల్‌ వెసికిల్స్‌ నుంచి శుక్రకణాలు, వీర్యం ఎప్పుడెప్పుడు బయటకు వెళ్లిపోదామా అని సిద్ధంగా ఉంటాయి. ఈ ఫ్రక్టోజ్‌ ద్రవం లేకపోతే శుక్రకణాలు జీవించలేవు. ఒకవేళ 48-72 గంటలకోసారి శుక్రకణాలు బయటకు వెళ్లకపోయినా కూడా.. ఈ ద్రవంలోని ఫ్రక్టోజ్‌ అంతా తినేసి, అవి లోపలే చనిపోతాయి కూడా. కాబట్టి వీర్యంలో బలం ఉంటుందనీ, అది బయటకు పోతే బలం పోతుందనే భావనలన్నీ పూర్తి అర్థరహితమైనవీ, అశాస్త్రీయమైనవే. ఒకవేళ సంభోగం, హస్తప్రయోగం వంటివేమీ జరగకపోయినా.. 'డ్రీమ్‌-స్లీప్‌ రిఫ్లెక్స్‌' రూపంలో నిద్రా సమయంలోనే వీర్యం దానంతట అదే బయటకు పోతుంది. కాబట్టి హస్తప్రయోగం వల్ల ఏదో బలహీనపడిపోతామని భావించటం శుద్ధ తప్పు. పైగా హస్తప్రయోగం వల్ల పురుషుడిలో- తనలో అంతా సవ్యంగానే ఉంది, ఎటువంటి లోపం లేదన్న భరోసా, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కూడా.

  • 'జీ' స్పాట్‌ను ప్రేరేపిస్తే స్త్రీలకు భావప్రాప్తి కలుగుతుందా?

 కలగాలనేం లేదు. నిజానికి చాలామందికి 'జీ స్పాట్‌' ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అసలు 'జీ స్పాట్‌' ఉందా? లేదా? అన్నదానిపైనా శాస్త్రవేత్తల్లో బోలెడు చర్చలున్నాయి. అయితే యోని లోపల.. ముందువైపు గోడ పైభాగంలో నాడీ చివళ్లన్నీ ఒకేచోట  కేంద్రీకృతమైన ప్రాంతం ఒకటి ఉంటుంది. దీన్ని మొదటగా గ్రిఫెన్‌బర్గ్‌ అనే శాస్త్రవేత్త  గుర్తించాడు, ఆయన పేరుతోనే 'జీ- స్పాట్‌' అంటున్నారు. నాడీ చివళ్లు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం ప్రేరేపితమైతేఎంతో గాఢమైన లైంగిక తృప్తి కలుగుతుందని కొందరు వాదించినా నిజంగా దీనికి అంతటి ప్రభావం ఉందా? లేదా? అన్న దానిపై పూర్తి స్పష్టత లేదు. అయితే ఒకటి మాత్రం సుస్పష్టం. యోని పైభాగాన చిన్న బుడిపెలా ఉండే యోనిశీర్షానికి (క్లిటోరిస్‌) మాత్రం శృంగారానుభవాన్ని ఇనుమడింపజేసే గుణం ఉంది. ఒకరకంగా పురుషులకు ఉండే శిశ్నం వంటిదే స్త్రీలలోని ఈ యోనిశీర్షం కూడా. సంభోగ సమయంలో పురుషాంగం దీన్ని తాకినా, దీనికి రుద్దుకున్నా స్త్రీకి అనిర్వచనీయమైన శృంగానుభవం, ఆనందం కలుగుతాయి. కేవలం దీన్ని రుద్దుకోవటం ద్వారానే భావప్రాప్తి కలిగే సందర్భాలూ ఉంటాయి.

  • సంభోగం ఎంతసేపు కొనసాగితే అంత తృప్తిగా ఉంటుందా?

 అలా జరగాల్సిన పనిలేదు. నిజానికి ఎక్కువసేపు సంభోగంలో పాల్గొనటమన్నది పురుషుడికి అసాధ్యం. ఎందుకంటే అంగ స్తంభనను ఎక్కువసేపు కాపాడుకోవటం కష్టం. ఒకవేళ స్తంభనను నిలుపుకొంటూ చాలాసేపు సంభోగం జరుపుతున్నా.. అంతసేపూ అతను స్త్రీకి తృప్తిని ఇస్తున్నాడనేం చెప్పలేం. యాంత్రికంగా ఏదో కానిచ్చేస్తూ.. ఆమెకు ఉత్తేజాన్నీ,
ఉద్రేకాన్నిచ్చే ప్రాంతాలను ప్రేరేపిస్తుండకపోవచ్చు. వాటిని అసలు పట్టించుకోకపోవచ్చు. భావప్రాప్తి కలగాలంటే ఆమెకు అవసరమైన గాఢమైన స్పర్శలనూ, స్పందనలనూ ఇవ్వటం
ముఖ్యంగానీ గంటలతరబడి సంభోగాన్ని కొనసాగించటం కాదు. దీనికి పూర్తి భిన్నంగా- కొద్దిసేపే సంభోగించినా ఆమెలో గాఢమైన స్పందనలు వచ్చేలా, తృప్తినిచ్చేలా చెయ్యొచ్చు.
కాబట్టి శృంగారంలో తృప్తికి 'ఎంత సేపు?' అన్నదొక్కటే కొలమానం కాదు. ఇక్కడ  గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే- ఆమె మనసు తెలుసుకోవటం, ఒకరి భావనలను ఒకరు పంచుకోవటం! ఎందుకంటే అందరికీ ఒకే రకమైన ప్రేరణలు తృప్తినివ్వాలనేం లేదు. అందరికీ ఒకటే పద్ధతి పనికిరాదు. స్త్రీలలో కూడా రకరకాల భావాలు, విశ్వాసాలు, భావోద్రేకాలు ఉంటాయి. కొందరికి కొన్ని పనులు నచ్చవు. కొందరికి కొన్ని బాగా ఇష్టంగా ఉండొచ్చు. కాబట్టి ఆమె మనసు తెలుసుకుని, బిడియాలు, సంకోచాల్లేకుండా, అరమరికలు లేకుండా ప్రవర్తించటం ముఖ్యం. స్త్రీలు కూడా తాము మనసులో ఏదో ఆశిస్తూ.. వాటిని పైకి చెప్పకుండా.. భాగస్వామి తమను పట్టించుకోవటం లేదనుకోవటం సరికాదు. తన ఇష్టాయిష్టాలను, వాంఛలను, తమకు ఇష్టమైన పనులనూ-పద్ధతులనూ భాగస్వామికి తెలియజెయ్యటం ముఖ్యం. ఇది లేకపోతే సంభోగం ఎంతసేపున్నా ఆనందం, భావప్రాప్తి ఉండకపోవచ్చు. కాబట్టి  ఎంతసేపు సెక్స్‌లో పాల్గొన్నారనే దానికంటే.. ఎలా పాల్గొంటున్నారనేదే ముఖ్యం. ఇద్దరికీ ఇష్టమై, ఎక్కువసేపు సెక్స్‌లో పాల్గొనగలుగుతుంటే మంచిదే. ఏమైనా సంభోగం ఎక్కువసేపు కొనసాగాలంటే అతనికి స్తంభనా, ఆమెలో స్రావాలూ, తగినంత ప్రేరణ, దీనికి ఇరువురిలోనూ గాఢమైన వాంఛా ఉండటం అవసరం. ఇరువురిలోనూ, అన్నీ ఇలాగే అమరటం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు కూడా.

  • గర్భనిరోధక మాత్రలు తీసుకుంటే బరువు పెరుగుతారా?

ఇందులో కొంత నిజం ఉంది. దీర్ఘకాలం గర్భనిరోధక మాత్రలు తీసుకునే స్త్రీలు కొంత బరువు పెరగొచ్చు. మాత్రలలో ఉండే హార్మోన్లు ఒంట్లో నీరు కాస్త ఎక్కువ నిల్వ ఉండేలా చేస్తాయి.
అంతకు మించి బరువు పెరగటానికి ఇతరత్రా కారణాలేమీ లేవు.

  • టాయ్‌లెట్‌ సీట్ల ద్వారా సుఖవ్యాధులు సంక్రమిస్తాయా?

చాలామంది సంక్రమించవనే చెబుతుంటారుగానీ వాస్తవానికి కొన్నిరకాల సుఖవ్యాధులు, ముఖ్యంగా చర్మవ్యాధులు సంక్రమించే అవకాశం లేకపోలేదు. టాయ్‌లెట్‌ సీట్ల ద్వారా సిఫిలిస్‌
క్రిములు, గోనోకోకల్‌ బ్యాక్టీరియా వంటివి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించేంతటి పరిస్థితి ఉండదు గానీ.. చర్మవ్యాధుల వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టాయ్‌లెట్‌ సీట్ల
ద్వారా ముప్పు తక్కువనే చెప్పొచ్చు. అయితే అస్సలు ముప్పు ఉండదని చెప్పటం మాత్రం కష్టం.

  • Dr.Sudhakar Krishna murty(andrologist/sex specialist) Hyderabad@eenadu sukhibhava 14/06/2014.
  • * ================================= * 
Visit my website : Dr.Seshagirirao.com _

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail